ఆసీస్ లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడు. 52 ఏళ్ల వార్న్ గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా పేరు గాంచిన వార్న్.. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగుతో ముప్పుతిప్పలు పెట్టాడు. వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కుప్పకూలిన వార్న్‌ను బతికించేందుకు మెడికల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
1992-2007 మధ్య కాలంలో వార్న్ 145 టెస్టులు, 194 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 1001 వికెట్లు తీసుకున్నాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన వార్న్ వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టగా, టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్‌లోనూ ఆడిన వార్నర్ 57 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి తొలి సీజన్‌లో జట్టుకు ట్రోఫీని అందించిపెట్టాడు. టెస్టుల్లో పదిసార్లు పదికి పది వికెట్లు పడగొట్టి అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
షేన్ వార్న్ మరణవార్తతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపపోయింది. ఈ వార్తను తాను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. జీవితమంటే ఇంతేనని, దానిని అర్థం చేసుకోవడం కష్టమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నాడు