చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగలలో దీపావళి ఒకటి. ఇది కేవలం ఒక్క రోజు పండుగ కాదు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలతో కూడిన గొప్ప వేడుక. ఈ ఏడాది దీపావళి ప్రధాన పూజ (లక్ష్మీ పూజ) అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. ఈ రోజున సాయంత్రం వేళ లక్ష్మీదేవి, గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 20 మధ్యాహ్నం 2:40 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమై అక్టోబర్ 21 సాయంత్రం 4:05 గంటలకు ముగుస్తుంది. సూర్యాస్తమయానికి అమావాస్య ఘడియలు అక్టోబర్ 20వ తేదీనే ఉండడం వల్ల ఆ రోజే దీపావళి జరుపుకోవాలి. ఇక ఆ రోజున లక్ష్మీ పూజను రాత్రి 7:08 గంటల నుంచి 8:18 గంటల మధ్య జరుపుకోవాలి.
దీపావళిని మొత్తం ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి రోజుకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఐదు రోజుల వేడుకలు అక్టోబర్ 18 నుంచి 23 వరకు జరుగుతాయి. ఇక మొదటి రోజు ధంతేరాస్ (ధన త్రయోదశి) – అక్టోబర్ 18న జరుపుకుంటారు. ఇక పూజ విధానానికి వస్తే.. ఈ రోజు లక్ష్మీదేవితో పాటు ఆరోగ్య ప్రదాత ధన్వంతరిని కూడా పూజిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి, అమృత భాండంతో ధన్వంతరి ఈ రోజునే ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు కొత్త వస్తువులు, ముఖ్యంగా బంగారం, వెండి లేదా పాత్రలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా ఉంటుందని ఆచారంగా భావిస్తారు. ఇది కీర్తి, అదృష్టాన్ని సూచిస్తుంది.
ఇక రెండో రోజు అక్టోబర్ 19న నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఆ రోజు నాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి రాక్షసుడు నరకాసురుడిని సంహరించిన రోజుకు ప్రతీకగా దీనిని జరుపుకుంటారు. నరకుడి పీడ విరగడైనందుకు ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. ఇక ఆ ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయడం ఆచారం. నువ్వుల నూనెలో, నదీ జలాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. ఈ రోజు నుంచే కాలువల వద్ద దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం ప్రారంభిస్తారు.
ఇక మూడో రోజు దీపావళి (లక్ష్మీ పూజ) అంటే అక్టోబర్ 20న.. రావణుడిని సంహరించిన అనంతరం శ్రీరాముడు సీతాసమేతంగా 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలికారు. ఇక ఆరోజు సాయంత్రం వేళ లక్ష్మీదేవి, గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ప్రార్థనలు చేస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించడం శుభకరం.
ఇక నాలుగో రోజు బలి పాడ్యమి లేదా గోవర్ధన పూజ అంటే అక్టోబర్ 22 నాడు జరుపుకుంటారు. ఆ నాడు ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తిన రోజుగా దీనిని పరిగణిస్తారు. ఆ రోజు ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపావళి మర్నాడు వామనుడి రూపంలో విష్ణుమూర్తి పాతాళానికి అణచివేసిన బలి చక్రవర్తి భూమిపైకి తిరిగివస్తాడని నమ్ముతారు. ఇక ఐదో రోజున భాయ్ దూజ్ లేదా భగినీ హస్త భోజనం నిర్వహిస్తారు. ఇక అక్టోబర్ 23న దీనిని జరుపుకుంటారు. ఇక ఆనాడు ఇది సోదరులు, సోదరీమణుల మధ్య బంధానికి ప్రతీక. యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించిన రోజు కూడా ఇదే. కాబట్టి ఆ రోజు సోదరీమణులు తమ సోదరుల నుదిటిపై తిలకం దిద్ది, వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. సోదరులు సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజుతో దీపావళి వేడుకలు పూర్తవుతాయి.
దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించి, ఇళ్లను శుభ్రం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, వచ్చే ఏడాది అంతా సుఖ సంతోషాలు ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. దీపావళి రోజు తెల్లవారుజామునే నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి. ఇంటి గుమ్మాన్ని మామిడి ఆకులతో, పూలమాలలతో అలంకరించి, సాయంత్రం రంగవల్లికలు (ముగ్గులు) తీర్చిదిద్దుతారు. దీపావళి రోజున వెలిగించే దీపాలకు మట్టి ప్రమిదలు, లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వాడటం ఉత్తమం. ఇక టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు, పిల్లలు జాగ్రత్త వహించాలి. అలాగే, పెద్ద శబ్దాలు చేసే టపాకాయలు కాల్చడం వల్ల పరిసరాల్లోని పసిపిల్లలు, వృద్ధులు, పక్షులు, పెంపుడు జంతువులు భయపడతాయి. మన ఆనందం కోసం మరో ప్రాణిని హింసించకుండా, రంగురంగుల కాంతులతో వెలుగులు విరజిమ్మే శబ్దరహిత, పర్యావరణ హితమైన టపాసులను కాల్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.