ఉద్యమ కార్యాచరణపై నేడుఐకాసల ఐక్యవేదిక సమావేశం.ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి నేడు
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును... శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు. ఈమేరకు ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. సమ్మెలో ఆర్టీసీ సంఘాలు పాల్గొనే అవకాశముంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు గురువారం జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. దీనికి ఐకాసలు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది.
జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు: బండి
పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈనెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో బుధవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో కలిసి పీఆర్సీ ఉత్తర్వుల ప్రతులను మంటల్లో దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదు. సమ్మె, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై గురువారం ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక సమావేశంలో చర్చిస్తాం. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు పింఛన్ అంశాలను సీఎస్‌తో మాట్లాడుకోవాలని సీఎం సూచించారు. మమ్మల్ని పిలిచి, మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సీఎస్ రాత్రిపూట ఉత్తర్వులు ఇచ్చారు. పీఆర్సీతో వేతనాల్లో రూ.6వేలు నుంచి రూ.7వేలు తగ్గిపోతాయి. ఇది ఐఏఎస్‌ల పన్నాగంలా అనుమానం వస్తోంది. అయిదు డీఏలను ఇంతకాలం పెండింగ్ పెట్టి, ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన మూడు డీఏల బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, సీసీఏ రద్దుతో వేతనంలో 18% తగ్గించి, డీఏల ద్వారా 20% ఇస్తున్నారు.
ఇది దుర్మార్గమైన చర్య. ఉద్యమం ద్వారానే డిమాండ్లను సాధించుకుంటాం. పీఆర్సీ ఉత్తర్వులు ఇవ్వడంలో సీఎంకు భాగస్వామ్యం ఉందని సీఎస్ చెప్పినందుకు ధన్యవాదాలు. ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. కరోనాతో చనిపోయిన ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎన్‌ఎంఆర్‌లుగా ఉద్యోగాలు ఇస్తామని సీఎంను అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను సైతం మోసం చేసింది’’ అని ఆరోపించారు.
రాబడిపై గందరగోళ ప్రచారం: సూర్యనారాయణ
ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఒకవైపు సీఎస్ చెబుతుండగా... మరోవైపు నవంబరు నెలాఖరుకు గత ఐదేళ్లల్లో కంటే ఎక్కువ రాబడి వచ్చినట్లు కాగ్ చెప్పిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఇది సమాజాన్ని తప్పుదారి పట్టించడమేనన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వ ఆదాయం తగ్గిందని విలేకర్ల సమావేశంలో సీఎస్ చెప్పారు. నవంబరు నెలఖారునాటికి గత ఐదేళ్లలో కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని కాగ్ వెల్లడించింది. ప్రభుత్వం తన విజయంగా ప్రచారం చేసుకుంటోంది. సీఎస్ చెప్పింది నిజమైతే ఏపీ ప్రభుత్వం కాగ్‌కు నోటీసులు ఇవ్వాలి? లేదంటే సీఎస్‌పై ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వానికి వదిలిపెడుతున్నాం. సీఎస్, ఆర్థికశాఖ అధికారులు పాత పవర్ ప్రజంటేషన్‌నే మళ్లీ చూపించారు. దాంట్లో శాస్త్రీయత, వాస్తవికత లోపించింది. కేంద్ర పీఆర్సీపై వితండ వాదం చేస్తున్నారు. పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచారు. కేంద్రంలో 60ఏళ్లకే ఉంది. దేన్ని ప్రమాణికంగా తీసుకుని పెంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రొఫెసర్లకు మాదిరిగా 65 ఏళ్లకు ఎందుకు పెంచలేదు. వైద్య కళాశాలల్లో పని చేస్తున్న వైద్యులు పదవీ విరమణ వయసును పెంచాలని గత ఐదేళ్లుగా కోరుతున్నా ఎందుకు పెంచడం లేదు. పదవీ విరమణ ప్రయోజనాలను రెండేళ్లకు వాయిదా వేసేందుకే వయోపరిమితి పెంచినట్లుఉంది. సీఎస్ పూర్తిగా విఫలమయ్యారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన ఆయనే ప్రతిబంధకంగా తయారయ్యారనిపిస్తోంది. పీఆర్సీ ఉత్తర్వులను నిలిపివేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తాం. కానీ, ఇది అవమానకరంగా ఉందని అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే హెచ్‌ఆర్‌ఏతో ఎక్కడైనా అద్దెకు ఇల్లు దొరుకుతుందా? ఎక్కడ పొరపాటు జరిగిందో సీఎం గుర్తించాలి’’ అని అన్నారు.
మట్టి ఖర్చులు మిగుల్చుకోవాలని చూస్తోంది: బొప్పరాజు
ఉద్యోగి చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులనూ మిగుల్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వేతనాల పెంపు కోసమే సమ్మె చేయాలని నిర్ణయించాం. ఇస్తున్న వేతనాలు తగ్గించి, గత ప్రభుత్వం ఇచ్చిన భత్యాల్లో కోత వేయడంతోనే సమ్మెకు వెళ్తున్నాం. సీపీఎస్ రద్దు సహా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వేతనాలపై సీఎస్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. జీతాలు తగ్గవని ప్రభుత్వం అనుకుంటే పాత జీతాలే ఇవ్వొచ్చు కదా...! రివర్స్ పీఆర్సీ మాకొద్దు. పాత జీతాలే ఇవ్వండి. ఉత్తర్వులను రద్దు చేసుకునే వరకూ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఉద్యమంలోకి అడుగుపెడితే వెనక్కి తగ్గేది ఉండదు. మా ఉద్యమానికి ప్రజల మద్దతు కోరుతున్నాం. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారు’’ అని వెల్లడించారు.