నవంబర్ 26ను ప్రతి సంవత్సరం మనదేశంలో రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని 'సంవిధాన్ దివస్' అని కూడా పిలుస్తారు.1949, నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీనిని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
https://youtube.com/live/LpD2VM7UYmc?feature=share
2015లో భారత రాజ్యంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. దీంతో 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం.
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడినను, 1950 జనవరి 26నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది. దీనికి కారణం 1930 జనవరి 26 నాటి చారిత్రాత్మకమైన 'సంపూర్ణ స్వరాజ్య' ఘటన.
1929 డిసెంబరు 31 అర్థరాత్రి జవాహర్‌లాల్ నెహ్రూ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు. 1930 జనవరి 26న దేశ ప్రజలందరూ పూర్ణ స్వరాజ్ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఆరోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని నెహ్రూ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా పలు పట్టణాలు, పల్లెల్లో క్రమశిక్షణతో ఆరోజున స్వాతంత్ర్యేచ్ఛ వ్యక్తం చేస్తూ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్రం వచ్చేసిందా అన్నట్లు ప్రజలందరూ, స్వాతంత్ర్య దినాన్నిజరుపుకున్నారు. ఈ సంఘటనకు గుర్తుగా రాజ్యాంగం నవంబర్ 26 న ఆమోదించబడినను జనవరి 26నుండి అమలులోనికి వచ్చింది.
నవంబర్ 26న మనదేశంలో జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకుంటారు. 1979లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబరు 26న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు. అప్పటినుంచి నేషనల్ 'లా' డే కూడా మన దేశంలో ఇదే రోజున జరుపుకుంటారు.
No comments:
Post a Comment