వేతన సవరణ సంఘం సిఫార్సుల్లో పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సచివాలయంలో గురువారం మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. డీఏ రికవరీ నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని, డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని నాయకులు కోరారు. పీఆర్సీ ప్రతి ఐదేళ్లకు అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని, పెండింగ్ పీఎఫ్, జీఎల్‌ఐ బిల్లులు మంజూరు చేయాలని విన్నవించారు. ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, గురుకులాలకు పీఆర్సీ అమలయ్యేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. వీటిపై శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు మంత్రుల కమిటీ బదులిచ్చింది. సీపీఎస్ రద్దుపై ఏప్రిల్ 4న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఉత్తర్వులు ఇచ్చేందుకు వారం సమయం పడుతుందని మంత్రులు పేర్కొన్నారు. పీఎఫ్, జీఎల్‌ఐ బిల్లుల డేటాను ఏప్రిల్ 4న ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఆర్సీ పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు విమర్శించారు.